BREAKING NEWS

1/21/15

Faith and Self Confidence Quotes in Telugu by Swamy Vivekananda

Faith and Self Confidence Quotes in Telugu by Swamy Vivekananda
మనలో మనకు తెలియని అనంతమైన శక్తి ఉందని,  దానిని విశ్వసించడం ద్వారా ప్రతి వ్యక్తి అద్భుతాలను సృష్టించగలడని  'Faith and Self Confidence Quotes in Telugu by Swamy Vivekananda'  లో విశదీకరించబడినది.  ఈ Faith and Self Confidence Quotes in Telugu చదవడం వల్ల మనపై మనకు అపారమైన నమ్మకం (ఆత్మవిశ్వాసం) కలుగుతుంది.  ఈ ఆత్మ విశ్వాసం ప్రతి వ్యక్తి తన జీవిత లక్ష్యాలను సాధించుటకు ఎల్లవేళలా తోడ్పడుతుంది, అసాధ్యం అన్న పదానికి వీడ్కోలు పలుకుతుంది, మనిషిని సన్మార్గం లో నడిపిస్తుంది మరియు జీవితాన్ని విజయాలతో వికసింపజేస్తుంది.




"ఆత్మవిశ్వాసం కలిగి ఉండండి.  మీరందరూ ఒకప్పటి
వేద ఋషులు.  ఇప్పుడు మీరు వేరే రూపాలలో వచ్చారు,
అంతే తేడా!  మీ అందరిలో అనంత శక్తి ఉంది, పగటివేళ
కాంతిలాగా ఈ విషయాన్ని స్పష్టంగా చూస్తున్నాను.
ఈ శక్తిని జాగృతం చేయండి.  మేల్కోండి, మేల్కోండి."

"అభివృద్ధి చెందడానికి మొదట మనపై, తరువాత భగవంతునిపై విశ్వాసం
కలిగి ఉండాలి.  తనపై విశ్వాసం లేనివానికి భగవంతునిపై విశ్వాసం కలగడం కల్ల."

"సత్యం, పవిత్రత, నిస్వార్ధత ఈ సద్గుణాలు ఉన్నవానిని నాశనం చేయగల
శక్తి సూర్యుడికి క్రిందా పైనా, సృష్టిలో ఎక్కడా లేదు.  ఈ సద్గుణ విశిష్టుడైన
వ్యక్తి సమస్తవిశ్వమూ తనను ప్రతిఘటించినా ఒక్కడే ఎదుర్కోగలడు."

"ఆత్మవిశ్వాసం కలిగి ఉండండి.  గొప్ప విశ్వాసాల నుండే
మహత్తర కార్యాలు సాధించబడతాయి."

"ఆత్మవిశ్వాసం ఉన్న కొందరి వ్యక్తుల చరిత్రే ప్రపంచ చరిత్ర.
ఆ విశ్వాసం వ్యక్తిలోని దివ్యత్వాన్ని వ్యక్తపరుస్తుంది.  మీరు ఏదైనా
సాధించగలరు.  ఆ అనంతశక్తిని అభివ్యక్తం చేయడానికి కావలసినంత
ప్రయత్నం చేయనప్పుడే మీరు విఫలమవుతారు.  ఎప్పుడైతే మనిషిలో
నమ్మకం సన్నగిల్లుతుందో అప్పుడు మరణం ఆసన్నమౌతుంది."

"మనకు కావలసింది శ్రద్ధ. మనిషికి మనిషికి మధ్య తేడా
శ్రద్ధలోఉన్న తారతమ్యమే గాని వేరేమీ కాదు. ఒక మనిషిని
గొప్పవాడుగాను; ఇంకొకరిని బలహీనుడుగాను, అధముడుగాను
చేసేది శ్రద్ధే (శ్రద్ధలో వ్యత్యాసం).  కాబట్టి ఈ శ్రద్ధ మీలో ప్రవేశించాలి."

"ఆత్మవిశ్వాసం మనపూర్వుల హృదయాలలో ప్రకాశించింది.
నాగరికతాభివృద్ధిలో వారిని ముందుకు తీసుకువచ్చిన క్రియాశక్తి
ఈ ఆత్మ విశ్వాసమే! మనకు ఏదైనా భ్రష్టత్వం, దోషం సంభవిస్తే
నా మాటను గుర్తు పెట్టుకోండి - ఆ భ్రష్టత్వం మన ప్రజలు
ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయిన నాటి నుండి ప్రారంభమైంది."

"నీలో అనంతశక్తి ఉందని విశ్వాసం కలిగి ఉండు. జాగరూకుడవై
ఆ శక్తిని వ్యక్తపరుచు.  నేను ఏదైనా సాధించగలను అని సంకల్పించు.
పాము విషం కూడా గట్టిగా తిరస్కరిస్తే మీపట్ల నిర్వీర్యమైపోతుంది.
జాగ్రత్త! చేయలేను అని అనవద్దు.  ప్రతికూల భావనలు రాకూడదు."

"మీపై మీరు విశ్వాసం కోల్పోవడం అంటే
భగవంతునిపై విశ్వాసం కోల్పోవడమే."

"విశ్వాసం! విశ్వాసం! ఆత్మవిశ్వాసం!
భగవంతునిపై విశ్వాసం! ఇదే ఔన్నత్య రహస్యం!"

"పురాణాలు పేర్కొన్న ముక్కోటి దేవతలపై మీకు విశ్వాసం
ఉన్నప్పటికీ, మీపై మీకు విశ్వాసం లేకపోతే మీకు ముక్తి కలుగదు.
ఆత్మవిశ్వాసంతో ధీరుడివై నిలబడు, అదే మనకిప్పుడు కావలసింది."

"నా మాటలను నమ్మడానికి సాహసిస్తే మీలో ప్రతి ఒక్కరికీ
భవిష్యత్తులో ఉజ్జ్వలదశ ప్రాప్తిస్తుంది.  నాపై నాకు చిన్నప్పుడు
ఎట్టి విశ్వాసం ఉండేదో అటువంటి అఖండ విశ్వాసం మీపై మీకు
ఉండి తీరాలి.  అనంతశక్తి భాండాగారం ప్రతి ఆత్మలోనూ ఉంది.
మీరు భారతదేశాన్ని పునర్నిర్మించగలరు."

"ఆత్మవిశ్వాసం ద్వారా సర్వం సాధించగలం.
ఈ విషయం స్వీయ జీవితంలో నాకు అనుభవానికి వచ్చింది."

"ఆత్మవిశ్వాసం మనకు గొప్ప సహాయకారి.  ఆత్మవిశ్వాసాన్ని గురించి
విస్తృతంగా తెలియబడి, అది పెంపొందింపబడితే మనకున్న దుఃఖాలు, రుగ్మతలు
చాలా వరకూ సమసిపోయేవి.  మానవాళి చరిత్రలో గొప్పగొప్ప స్త్రీ పురుషుల జీవితాలలో
ఆత్మవిశ్వాసమే వారికి అత్యధిక స్ఫూర్తి దాయకమైన శక్తిగా పరిణమించింది.
తాము గొప్పవారుగా అవడానికి జన్మించామని భావించి వారు గొప్పవారయ్యారు."

"నేను చెప్పదలచుకున్నదేమంటే మనలో ఉన్న అవగుణాలన్నీ
శ్రద్ధలేమి వల్ల కలిగినవే! ఈ శ్రద్ధలేమి మనకు ఇంకా అధికంగా
చెడునే కొనితెస్తూ ఉంది.  రోగాన్ని కేవలం నొక్కిపెట్టకుండా
మూలకారణంతో సహా తొలగించి వేయడమే నా చికిత్సా విధానం."

"శ్రద్ధ అనే ఆదర్శాన్ని మరలా మనలో తీసుకురావాలి.  ఆత్మ విశ్వాసం
పున: జాగృతం కావాలి.  అప్పుడు మాత్రమే మనదేశం ఎదుర్కొంటున్న
 సమస్యలన్నింటినీ క్రమంగా మనమే పరిష్కరించుకోగలం."

"అపార విశ్వాసం, అనంత శక్తి
ఇవే విజయసాధనకు మార్గాలు."

"దృఢ సంకల్పం, పవిత్ర ఆశయం తప్పక సత్ఫలితాలను ఇస్తాయి.
వీటిని ఆయుధాలుగా గ్రహించిన వారు, వారు కొద్దిమందే అయినా,
అన్ని విఘ్నాలను ఎదుర్కొని నిలువగలుగుతారు."

"జనులను వారికి తోచింది మాట్లాడ నివ్వండి, మీ ఆశయాలను అంటిపెట్టుకొని ఉంటే,
సమస్త లోకం మీ పాదాక్రాంతమౌతుంది.  వారిపై వీరిపై విశ్వాసం ఉంచమని వారు చెపుతారు.
కానీ నేను చెబుతున్నాను ప్రథమంగా మీపై విశ్వాసం కలిగి ఉండండి.  అదే విజయానికి మార్గం."

"మనకు ఇప్పుడు కావల్సింది వేదాంతంతో మేళవింపబడిన పాశ్చాత్య విజ్ఞానశాస్త్రం, దానికి
మూలమంత్రంగా బ్రహ్మచర్యం పాటించటం మరియు శ్రద్ధ, ఆత్మవిశ్వాసాలను కలిగి ఉండటం."