BREAKING NEWS

1/26/15

Will Power Quotes in Telugu by Swami Vivekananda

Will Power Quotes in Telugu by Swamy Vivekananda
విల్ పవర్ (ఇచ్ఛాశక్తి) యొక్క సమర్ధత ఎంత గొప్పదో ఈ Will Power Quotes in Telugu అనే పేజీలో చాలా వివరంగా చెప్పబడినది.  విల్ పవర్ తక్కిన శక్తులన్నింటి కంటే పవిత్రమైనది, బలవత్తరమైంది.  విల్ పవర్ ఉన్న వ్యక్తిని అత్యంత శక్తిమంతులుగా లోకం భావించడమే కాదు, వారిని సగౌరవంగా ఆదరిస్తుంది.  విల్ పవర్ తో మహాకార్యాలు సాధించబడతాయని, అందుకొరకు నిశ్చలమైన దీక్ష మరియు అద్వితీయమైన సంకల్పం అవసరం అని Will Power Quotes in Telugu by Swami Vivekananda ద్వారా స్పష్టమగుచున్నది.  కష్టాలు ఎంత పెద్దవైనా ఇచ్ఛాశక్తి వలన వాటిని అదృశ్యం చేయగలము.  దీనినే మనం ఆత్మశక్తి గా భావించవచ్చు.  ఈ ఆత్మ శక్తిని మాటి మాటికి భావించు, వెలుగు వచ్చే తీరుతుంది.



"సర్వము నాయందున్నది.  ఇచ్చామాత్రమున నేను
దానిని అభివ్యక్తము చేయగలను అని పలకండి."

"పట్టుదల వదలకుండా చేసే ప్రయత్నం చివరకు విజయాన్ని చేకూరుస్తుంది.
ఒక్క రోజులో దేన్నీ సాధించలేము."

"ప్రతివారు తమ శక్తికొలది పాటుపడనిచో, ఏ కార్యమైనా సాధ్యమౌతుందా?
కార్యశూరుణ్ణి, పురుష సింహుణ్ణి విజయలక్ష్మి వరిస్తుంది.  వెనుకకు
చూడనవసరం లేదు.  ముందుకు నడవండి!  అఖండ శక్తి,
అఖండ ఉత్సాహం, అఖండ ధైర్యం, సహనం ఇవే మనకు ఆవశ్యకాలు.
ఇవి ఉన్నప్పుడే మహత్కార్యాలు సాధింపబడతాయి."

"లేవండి! పోరాడండి! ఒక్క అడుగు కూడా వెనక్కు వేయరాదు.
ఏమైనా రానీ, పోరాడి తేల్చుకోండి.  నక్షత్రాలు గతులు తప్పినా సరే!
లోకమంతా ఏకమై మిమ్మల్ని ప్రతిఘటించినా సరే! మరణమంటే దుస్తులను
మార్చుకోవటం వంటిదే.  దానికి చింత ఏల?  కాబట్టి పోరాడండి!"

"మనకు నిత్యజీవితంలో కలిగే సమస్యలన్నీ మనస్సును నిగ్రహించుకోలేక
పోవడం వల్ల కలుగుతున్నవే! ద్వేషపూరిత తలంపులు, చెడు భావాలు
మనస్సును బలహీనపరుస్తాయి. అలాగే మనం నిగ్రహించుకున్న ప్రతి
చెడు భావన, ద్వేషపూరిత చర్య మనలో సానుకూల శక్తిని ఉత్పన్నం చేస్తుంది.
ద్వేషాన్ని, క్రోధ భావాన్ని నిగ్రహించుకున్నప్పుడల్లా మనలో సానుకూల భావాలు
సుశక్తి రూపం లో నిక్షిప్తమై, ఇంకా ఉన్నతమైన భావప్రేరణలుగా అభివ్యక్తమౌతాయి."

"పిరికివారిగా మారి మీరు సాధించేదేమీ ఉండదు.
ఒక్క అడుగు వెనుకకు వేయడం వల్ల మీరు ఏ
విపత్తునూ తప్పించుకోలేరు."

"ప్రతి మనిషినీ నేనొక ప్రశ్న అడుగుతాను.
నీవు బలంగా ఉన్నావా? బలం నీ బుద్ధికి అనుభవమౌతున్నదా?
ప్రపంచములోని సర్వరుగ్మతలకు బలమే ఔషధం."

"పరిస్థితులను ఎదుర్కొని పోరాడి ముందుకు సాగినప్పుడే,
పురోగమించడానికి మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేసినప్పుడే
ఆత్మ అతులిత శక్తి సంభరితమై బయటకు వస్తుంది."

"నాకేమీ తెలియదు, నేనేమీ కాను అని చెప్పడం వినయమా?
ఇది పనికిమాలిన త్యాగం, హాస్యాస్పదమైన వినయం
అని చెబుతున్నాను.  అటువంటి ఆత్మవంచనను విడనాడు."

"మనోవ్యాకులత నీ ముఖాన ద్యోతకమౌతున్న రోజున
బయటకు రాకుండా తలుపులేసుకొని గదిలో కూర్చో! ఈ
వ్యాధిని ప్రపంచంలో వ్యాపింపజేయడానికి నీకేం హక్కు ఉంది?"

"ఓ మిత్రమా! నిన్ను దు:ఖితునిగా చేస్తున్నది ఏది? సర్వ శక్తీ
నీలోనే ఉంది.  ఓ శక్తిశాలీ! నీ సర్వశక్తి స్వభావాన్ని వ్యక్తీకరించు.
ఈ సమస్తలోకమూ నీకు పాదాక్రాంతమవుతుంది.
శక్తిమంతమైనది ఆత్మే కాని, జడ పదార్ధం కాదు."

"నీవు బలాఢ్యుడవు, సర్వ శక్తిమంతుడవు, సర్వజ్ఞుడవు.  ఆ శక్తిని
నీవు ఇప్పటి వరకూ అభివ్యక్తం చేసి ఉండలేదు.  కాని అది నీలోనే ఉంది.
నీవు సర్వశక్తిమంతుడవు, పరమ పవిత్రుడవు, నిత్య ముక్తుడవు.
సమస్త జ్ఞానాన్ని నీయందే కలిగి ఉన్నవాడవు.  ఈ జ్ఞానాన్ని నీవు
ఎందుకు ప్రకటించలేవు? నీకు దీనిపై విశ్వాసం కలుగలేదు కనుక
విశ్వాసం ఏర్పడిన వెంటనే అది తప్పక అభివ్యక్తమై తీరుతుంది."

"నీవు కూడా ఆ అనంత శక్తి, అనంత జ్ఞానం, అప్రతిహతమైన
ఉత్సాహం నీలో ఉన్నాయని తలుస్తూ ఆ శక్తిని బహిర్గతం
చేయగలిగితే, నీవు కూడా నాలాగా అవగలవు."

"లోపం ఉన్నదని భావించడమే లోపాన్ని సృజిస్తున్నది.
బలము, పరిపూర్ణతల గురించి భావించడమే లోపాన్ని సరిదిద్దగలదు."

"పోరాటమే జీవిత లక్షణం."

"అపజయం కలిగుతుందని నేను పోరాటం నుండి పారిపోవాలా?
ధీరుడైనవాడు ధరించే ఆభరణమే ఓటమి.  ఏమిటి?
యుద్ధం చేయకుండా పరాజయాన్ని అంగీకరించడమా?"

"నీవు కూడా ఆ అనంత శక్తి, అనంత జ్ఞానం, అప్రతిహతమైన
ఉత్సాహం నీలో ఉన్నాయని తలుస్తూ ఆ శక్తిని బహిర్గతం
చేయగలిగితే, నీవు కూడా నాలాగా అవగలవు."

"కష్టాలు పర్వతం అంతగా కనిపించినా, పరిస్థితులన్నీ భయంకరంగా,
నిరాశాజనకంగా ఉన్నా అవి అన్నీ మాయే, భయపడ వద్దు,  అది
తొలగిపోతుంది.  అణచిపెట్టండి, అది అదృశ్యమౌతుంది; త్రొక్కివేయండి,
అది అంతరిస్తుంది.  భయపడకు! ఎన్ని సార్లు పరాజయాన్ని పొందానని
ఆలోచించవద్దు.  తలచవద్దు.  కాలం అనంతం, ముందుకు సాగిపో!
ఆత్మ శక్తిని మాటి మాటికి భావించు, వెలుగు వచ్చే తీరుతుంది."

"ధీర హృదయమా! నీ శక్తి సామర్ధ్యాలన్నింటితో
అంధకారాన్ని అధిగమించు."

"జీవితమే ఒక పోరాటం అని పాఠం.  ఈ జీవితం లో మనం పొందదగిన
మహత్తర ప్రయోజనం పోరాటమని గ్రహించండి.  పోరాటం ద్వారానే
మనం ముందుకు సాగిపోతాం.  స్వర్గానికి మార్గమేదైనా ఉంటే, అది
నరకం ద్వారానే.  ఎప్పుడైనా సరే నరకం నుంచే స్వర్గానికి దారి."

"కార్యసిద్ధికి మీరు నిశ్చలమైన దీక్షను పూనాలి.  అద్వితీయమైన సంకల్పాన్ని
కనబరచాలి.  కార్య తత్పరుడు - నేను సముద్రాన్ని త్రాగి వేస్తాను అంటాడు.
నేను సంకల్పిస్తే పర్వతాలు చూర్ణం కావల్సిందే అని అంటాడు.  ఇటువంటి
వీర్యోత్సాహవంతుడవై, ఇటువంటి దృఢ సంకల్పాన్ని పూని తీవ్ర ప్రయత్నం చేయి.
తప్పక గమ్యస్థానం చేరతావు.  అంటే, పరమావధిని పొందుతావు."

"ఇచ్ఛాశక్తి తక్కిన శక్తులన్నింటి కంటే బలవత్తరమైంది.  అది సాక్షాత్తు
భగవంతుని వద్ద నుండే వస్తుంది కాబట్టి దాని ముందు తక్కినదంతా
లొంగిపోవాల్సిందే.  పవిత్రము, దృఢము అయిన ఇచ్ఛ(సంకల్పం) సర్వశక్తిమంతమైనది."

"సాధువర్తనమే చిరకాలం మనగలిగి ఫలవంతమవడానికి
తగిన శక్తి కలిగి ఉంది.  దౌర్జన్యానికి, హింసకు అటువంటి శక్తి లేదు."

"లోకం బలవంతులను, శక్తిమంతులను మాత్రమే ఆదరిస్తుంది."

"వెనక్కు చూడవలసిన పని లేదు.  పురోగమించండి.  మనకు కావలసినవి అనంతశక్తి,
పట్టుదల, ధైర్యం మరియు అనంత సహనం. అప్పుడే మహాకార్యాలు సాధించబడతాయి."