BREAKING NEWS

1/19/15

Swami Vivekananda Quotes on Self Confidence in Telugu

Swami Vivekananda Quotes on Self Confidence in Telugu
A powerful list of Swami Vivekananda Quotes on Self Confidence in Telugu. ధీరులైన యువతకు ఆత్మ విశ్వాసాన్ని పెంచేందుకు స్వామి వివేకానంద అద్భుతమైన కొటేషన్లు భారతావనికి అందించారు.  మన ఆత్మ ఔన్నత్యాన్ని విశ్వసించడానికి, వ్యక్తిత్వ వికాశానికి, మనలో ఉన్న శక్తిని మేల్కొల్పుటకు ఈ కొటేషన్లు ఎంతగానో ఉపకరిస్తాయి. వాటిలో కొన్నింటిని ఈ 'Swami Vivekananda Quotes on Self Confidence in Telugu' పెజీలో పొందుపరచ బడినవి.  కార్య సాధనకు స్వామి వివేకానంద అందించిన చక్కని విజయ సోపానాలు ఈ 'Quotes on Self Confidence in Telugu'.


“సమస్త గ్రంథాలలో ఉన్న జ్ణానమంతా నీలోనే ఉంది. అంతకంటే
వేయిరెట్లు ఎక్కువగా ఉంది. ఆత్మవిశ్వాసాన్ని ఎన్నడూ కోల్పోవద్దు.
ఈ విశ్వంలో నీవు దేన్నైనా సాధించగలవు. ఎన్నడూ దౌర్బల్యానికి
లోనుగాకు. సమస్త శక్తీ నీదే.”

“ఏ వ్యక్తి అయినా, ఏ దేశమైనా ఉన్నత స్థితికి చేరుకోవాలంటే
మూడు లక్షణాలు అవసరం. అవి:
1. మంచితనానికి ఉన్న శక్తి మీద అఖండ విశ్వాసం.
2. అసూయ, అనుమానం లేకుండా ఉండడం.
3. మంచిగా ఉండాలనుకునే వారికీ, మంచి చేయదలచుకునే వారికి తోడ్పడటం.”

“కాదు, నాకు చేతకాదు అని ఎన్నడూ అనవద్దు.
మీరు అనంతులు. మీ స్వభావంతో పోల్చితే దేశకాలాలు
అన్నీ అల్పమై తోస్తాయి. మీరు సర్వశక్తి సంపన్నులు,
దేనిని చేపట్టితే దానిని సాధించగలరు.”

“మనకు శ్రద్ధకావాలి, ఆత్మ విశ్వాసం కావాలి. బలమే జీవనం,
బలహీనతే మృత్యువు. మేము ఆత్మ స్వరూపులం, మృత్యురహితులం,
ముక్తులం, పవిత్రులం, స్వభావ సిద్ధంగా పరిశుద్ధులం. అటువంటి మేము
ఎప్పుడైనా ఏ పాపమైనా చేస్తామా?... అసంభవం! ఇటువంటి విశ్వాసం కావాలి.
అటువంటి విశ్వాసం మనల్ని మనుష్యులను చేస్తుంది. దేవతలను చేస్తుంది.
ఈ శ్రద్ధాభావం లోపించంటం వల్లనే దేశం నాశనమై పోయింది.”

“మీ భాగ్యానికి మీరేగదా కర్తలు. మీ వ్యధలకు మీరే కారకులు.
మంచి చెడులను సృష్టించుకునేది మీరే. చేతులతో కళ్లు మూసుకొని
చీకటి అంటున్నదీ మీరే. చేతులను తీసివేసి వెలుతురును చూడండి.”

“ఇది తలవ్రాత అని మూర్ఖుడు, పిరికివాడు మాత్రమే వచిస్తారని
ఒక సంస్కృత సూక్తి. బలవంతుడు నా తలవ్రాతకు నేనే కారకుణ్ణి
అని ధైర్యంగా నిలిచి చెప్తాడు. వృద్ధాప్యంలో అడుగుపెడుతున్న
వారే అదృష్టాన్ని గూర్చి మాట్లాడతారు.”

“ఇతరులకు ఏ కొద్ది పాటి మంచి చేసినా అది మనలో
ఉన్న శక్తిని మేల్కొల్పుతుంది. క్రమంగా అది మన హృదయంలో
సింహ సదృశమైన బలాన్ని నింపుతుంది.”

“సత్యానికీ, మానవాళికీ, నీ దేశానికీ
విశ్వాసపాత్రుడవై ఉండు.
నీవు ప్రపంచాన్ని కదలించి వేయగలవు.”

“దేనికీ భయపడకండి. మీరు అద్భుతాలను సాధించగలరు.
భయపడిన మరుక్షణమే మీరు ఎందుకూ పనికిరాని వారవుతారు.
లోకంలోని దుఃఖమంతటికీ మూలకారణం ఈ భయమే!
భయమే సర్వబంధకారిణి. నిర్భయత్వం ఒక్క క్షణంలో సైతం
స్వర్గాన్ని ప్రాప్తింపజేయగలదు.”

“ప్రతిఘటన, వ్యతిరేకత ఎంత ఉంటే అంత మంచిది. ప్రతిఘటన
లేనిదే నదికి వడి (వేగం) వస్తుందా? ఒక విషయం ఎంత క్రొత్తదైతే,
ఎంత మంచిదైతే ప్రారంభ దశలో అది అంత వ్యతిరేకతను
ఎదుర్కోవలసి వస్తుంది. వ్యతిరేకతంతా విజయ సూచకమే.”

“కొద్ది మంది వ్యక్తులు మనోవాక్కర్మలయందు ఒక్కటైతే
ప్రపంచాన్ని ఉర్రూతలూగించగలరు. ఈ సత్యాన్ని
ఎన్నడూ మరువకండి.”

“మన వర్తమాన స్థితి పూర్వకర్మల ఫలితమైతే మనకు భవిష్యత్తులో
కలిగే స్థితి ప్రస్తుత కర్మల ఫలితంగా పొందవచ్చని నిశ్చితమగుతున్నది.
కాబట్టి పనులను ఎలా ఆచరించాలో మనం తెలుసుకోవాలి. ఇలా
కర్మలను చేసే విధానం తెలుసుకుంటే అద్భుత ఫలితాలను పొందవచ్చు.
అల్పకార్యాలుగా పరిగణించబడే వాటిని కూడా తృణీకార భావంతో చేయకూడదు.”

“మిమ్మల్ని మీరు మహాపురుషులని భావించండి!
అప్పుడు మీరు మహాపురుషులే అవుతారు. మన అందరిలో
ఆ దివ్యాత్మ ఉంది. దీనిని మనం విశ్వసిస్తాం గాక!”

“నీవేది కాగోరితే అది కాగలవు.
నీవు దీనుడవని తలిస్తే దీనుడవే అవుతావు.
బలాఢ్యుడనని తలిస్తే బలాఢ్యుడవే కాగలవు.”