BREAKING NEWS

1/18/15

Swami Vivekananda Quotes on Divinity of Man in Telugu

These are the best collection of 'Swami Vivekananda Quotes on Divinity of Man in Telugu'.  స్వామి వివేకానంద మానవునిలోని దివ్యత్వం గురించి అద్భుతంగా వివరించిన కొన్ని కొటేషన్లు ఇక్కడ ఇవ్వబడ్డాయి.  స్వామి వివేకానంద ఆశయాన్ని క్లుప్తంగా కొన్ని మాటల్లో చెప్పవచ్చు. అదే - మానవకోటికి వారిలోని దివ్యత్వాన్ని గూర్చి బోధించి, వారి జీవిత ప్రతికార్యకలాపంలోనూ ఆ శక్తిని ఎలా అభివ్యక్తం చేయాలో ప్రబోధించడమే. ఈ విషయాన్ని "Swami Vivekananda Quotes on Divinity of Man" లో ప్రబోధించడం జరిగినది.


Swami Vivekananda Quotes on Divinity of Man



భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచించేవాడికి భయం ఉంటుంది.
గతం గురించి ఎక్కువ ఆలోచించేవాడికి బాధ ఉంటుంది.
వర్తమానంలో జీవించేవాడికి ఆనందం ఉంటుంది.

మీరంతా అనంత శక్తి సమన్వితమైన ఆత్మ
స్వరూపులుగా భవించుకోండి. అప్పుడు ఎలాంటి
శక్తి ప్రకటితమౌతుందో చూడండి.

శక్తి అంతా మీలోనేవుంది! దీనిని విశ్వసించండి.
బలహీనులమని భావించకండి! లేచి నిలబడి మీలో
అంతర్లీనంగా వున్న శక్తిని ప్రకటించండి!

మానవునిలో ఏదేది ప్రబలమో, మంచిదో,
శక్తిమంతమో అదంతా ఆ దివ్యత్య వ్యక్తీకరణే.
అనేకులలో అది గర్భితంగానే ఉన్నా, అందరూ దివ్యులే.
కాబట్టి మనిషికీ మనిషికీ మధ్య నిజానికి భేదం లేదు.

మనం సర్వశక్తిమంతుడైన పరమేశ్వరుని బిడ్డలం,
ఆ అఖండ దివ్యాగ్నిలో నిప్పురవ్వలం. మనం పనికిరానివారం
ఎలా అవుతాము? మనం సర్వం సాధించడానికి సిద్ధంగా వున్నాం.
మనం దేనినైనా చేయగలం, మనిషి ఏకార్యాన్నైనా సాధించి తీరాలి.

మనిషి అంతర్గతంగా అనంత శక్తి కలిగి వున్నాడు.
అతడు దానిని అనుభూతమొనర్చుకో గలడు, అది సాధ్యమే.
అయినా ఆ విషయంపై మనిషికి నమ్మకం లేదు.

నా దృష్టిలో ఎవరైనా తనను తాను అల్పుడనని,
హీనుడనని తలచడమే మహా పాతకం, అజ్ఞానం.

నీవు ఎవరివి, నీ స్వస్వరూపం ఏమిటో తెలుసుకో.
అంతర్నిహితంగా ఉన్న అనంత శక్తిని జాగృత పరచుకో.
అప్పుడు బంధాలు తెగిపోతాయి.

ప్రతి ఒక్కరిలోనూ అనంత జ్ఞానం పరిపూర్ణంగానే వుంది.
మీరు అజ్ఞానులుగా కనబడవచ్చు గాని, నిజానికి మీరు అజ్ఞానులు కారు.
నా మాటలకు మీరిప్పుడు నవ్వవచ్చు, కాని వాటిని అర్ధం చేసుకొనే
సమయం వచ్చి తీరుతుంది. మీరు నన్ను తప్పక అర్ధం చేసుకొనితీరుతారు.

అనంతమైన, అఖండమైన, అవినాశియై భాసిల్లుతున్న తన ఆత్మ వైభవం పైనే
మనిషి ఆధారపడి వున్నడు. ఆ ఆత్మలోకి ఏ ఆయుధమూ చొరబడలేదు,
ఆ ఆత్మను గాలి ఆర్పలేదు, అగ్ని దహించలేదు, నీరు తడుపలేదు. దానికి
ఆద్యంతాలు లేవు, జన్మ మృత్యువులు లేవు. ఆత్మ ప్రభావం ఎదుట ఆకాశం
శూన్యంగా తోస్తుంది. కాలం అభావమైపోతుంది. ఇట్టి మహిమోపేతమైన
ఆత్మయందు మనకు విశ్వాసం వుండాలి. అందులోంచి మనకు శక్తి వస్తుంది.

అనంత శక్తి మనిషి ఆత్మయందే ఉంది. ఆ శక్తి గురించి
అతనికి తెలిసి ఉండవచ్చు లేదా తెలియకపోవచ్చు. ఆ ఆత్మ
గురించిన ఎరుకను కలిగి ఉండటమే దానిని అభివ్యక్తం చేయడమంటే.
మనిషి తన అనంత శక్తిని, జ్ఞానాన్ని గుర్తెరిగినప్పుడు
ఆత్మ స్వీయ ఔన్నత్యాన్ని ప్రకటిస్తుంది.

భేరీనాదంతో లోకమంతటా చాటండి. "మీలో ఏ పాపమూ లేదు,
దైన్యమూ లేదు, మీరు అనంతశక్తి సంపన్నులు.
లేవండి! మేల్కొనండి! మీలో వున్న దివ్యత్వాన్ని వ్యక్తీకరించండి".

అనంత పరిపూర్ణత్వం బీజరూపంలో అందరిలోను ఉంది. మనం
ఆశావహ దృక్పథాన్ని అలవరచుకొని, అన్నింటిలో వున్న మంచినే
చూడడానికి ప్రయత్నించాలి. మనం మూల కూర్చొని దేహంలోని,
మనస్సులోని లోపాలను గురించి దుఖించడం వల్ల కలిగే
ప్రయోజనమేదీ లేదు. ప్రతికూల పరిస్థితులను అధిగమించడానికి
చేసే వీరోచిత ప్రయత్నమే ఆత్మోన్నతిని కలుగజేస్తుంది.

జీవితం గడుస్తున్న కొద్దీ రోజురోజుకూ ప్రతిమనిషీ దైవమే
అనే భవన నాలో దృఢ పడుతోంది. ఎంత దుష్ట స్వభావం గల
స్త్రీలోనైనా, పురుషుడిలోనైనా ఆ దైవత్వం నశించదు.

'జ్ఞానమే (సర్వోత్కృష్టం) శక్తి ' అని లోకోక్తి కదా! జ్ఞానంతోనే మనం
శక్తిమంతులమవుతాం. మనిషి తనను తాను అనంత శక్తి సమన్వితుడిగా
బల సంపన్నుడిగా తెలుసుకోవాలి. మనిషి స్వస్వరూప రీత్యా సర్వజ్ణుడు,
సర్వ శక్తిశాలి. ఇది అతడు తప్పక గ్రహించాలి. తన ఆత్మ స్వరూపాన్ని
గ్రహిస్తూన్న కొద్దీ మనిషి ఈ శక్తిని అధికంగా ప్రకటితం చేయగల్గుతాడు.
బంధాల నుండి విడివడి ముక్తుడవుతాడు.

ఆత్మ ఎన్నడూ జన్మించి ఉండలేదు, ఎన్నడూ మరణించదు.
మనం మరణిస్తామన్న భవన, చావుకు భయపడటం వంటివి
కేవలం మూఢనమ్మకాలు. మనం దీనిని చేయగలం, దానిని చేయలేం
అనే భావాలు కూడా భ్రాంతి జనితాలే. మనం అన్నింటినీ చేయగలం.

ఎల్లప్పుడు ఆత్మను గూర్చి వినండి. ఆత్మను గూర్చి మాట్లాడండి.
ఆత్మను గూర్చి విచారణ చేస్తుండండి. ఈ విధంగా సాధన సాగిస్తే,
కాలక్రమంగా మీలోని సింహము (బ్రహ్మము) కూడా మేల్కొంటుంది.

అంతరాత్మ ఎల్లప్పుడు దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది.
దాని నుండి తొలగిపోయి ఈ ఐహికమైన మాంసం, ఎముకలతో
కూడిన పంజరం వైపు తమ దృష్టిని మరల్చి, మానవులు నేను,
నేను, నేను, అని అంటున్నారు. బలహీనతలన్నింటికి ఇదే మూలం.

జడపదార్ధం శక్తి సమన్వితమైతే, సంకల్పం సర్వశక్తి సమన్వితం. ఈ విశ్వాసం
మీ జీవితాల్లో కనిపించు గాక! మీ ఘనత, మీ ఔన్నత్యం, సర్వశక్తిమంతమైన
మీ స్వభావాన్ని గూర్చిన ఆలోచనలను నిరంతరం కలిగి ఉండండి.

ఈ వేదాంత భావాలు అరణ్యాలకు, గుహలకే పరిమితం కాకుండా అందరి
ముంగిట్లోకి అవి రావాలి. న్యాయవాద వృత్తిలోని వారికి న్యాయమూర్తులకు,
ఆధ్యాత్మిక సభా సమూహాలలోనికి, గుడిసెలో నివసించే పేదవాడికి, చేపలు పట్టే
బెస్తవారికి, విద్యార్థి లోకానికి ఈ భావాలు అంది ఆచరణాత్మకం అవ్వాలి.
చేపలు పట్టేవాడు తాను ఆత్మనని భావిస్తే ఉత్తమ బెస్తవాడుగా మారతాడు.
విద్యార్థి తనను తాను ఆత్మగా భావిస్తే ఉత్తమ విద్యార్థిగా ఎదుగుతాడు.
న్యాయవాది తనను ఆత్మగా భావిస్తే ఉత్తమ న్యాయవాదిగా రాణిస్తాడు.