BREAKING NEWS

2/18/15

How To Improve Your Memory While Studying

How To Improve Your Memory While Studying
How To Improve Your Memory While Studying
How To Improve Your Memory Power While Studying? The Great Ways to Improve Your Memory:
ప్రపంచంలోని కోట్లాది మానవులలో ఉన్న మెదడు ఒకే సామర్ధ్యాన్ని(power) కలిగి వుంటుంది.  దానిని ఉపయోగించుకొనే విధానం లోనే తేడా ఉంటుంది.  మనిషి మెదడు యొక్క గరిష్ఠ సామర్ధ్యం ఎంత? అన్న ప్రశ్నకు సమాధానం: మన ఊహలకు అందనంత అని చెప్పవచ్చు.  ప్రపంచంలోని అధునాతన సూపర్ కంప్యూటర్ల కంటే ఎన్నోరెట్లు శక్తివంతమైనది.  అవును... ఇది నిజం, మెదడు యొక్క శక్తి అనంతమైనది.  అందుకే జ్ఞాపకశక్తి ఏ ఒక్కరి సొంతం కాదు.  మెదడును సరియైన పద్ధతిలో ఉపయోగించుకుంటే ఎవరైనా సరే ఘన విజయాలను సాధించగలరు, అద్భుతాలను సృష్ఠించగలరు.  మనిషి మనుగడకు గాలి, నీరు, ఆహారంతో పాటు జ్ఞాపకశక్తి కూడా ఒక ముఖ్యమైన ప్రాధమిక అవసరం.  జ్ఞాపకశక్తి లేని మనిషి జీవితం ఒక ప్రశ్నార్ధకం.  మరి ఇంతటి ప్రాముఖ్యం  ఉన్న మన మెదడుని సంరక్షించుకోవడం, అద్భుతమైన జ్ఞాపకశక్తిని పెంపొందించుకోవడం ఎంతైనా అవసరం.

అద్భుతమైన జ్ఞాపకశక్తిని పెంపొందించుకోవడానికి మొదటి పద్ధతి: ఆత్మవిశ్వాసం.

 నేను తెలివైన వాడిని, నాకు జ్ఞాపకశక్తి సంపూర్ణంగా ఉంది, నేను చదివిన విషయాలను గుర్తుపెట్టుకోగలను అని తరచూ మీలో మీరు అనుకుంటూ ఉండటం వలన కొద్ది రోజులలోనే మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.  అంటే, దేనినైనా సాధించగలను అన్న బలమైన నమ్మకం మీలో కలుగుతుంది.  ఈ ఆత్మవిశ్వాసం మీ జ్ఞాపకశక్తిని పెంచుకొనుటకు, అపజయాల నుండి విముక్తి పొందుటకు ఎంతగానో తోడ్పడుతుంది.  ప్రపంచంలో ఎన్నో అద్భుత విజయాలు సాధించి చరిత్రకెక్కిన వారి విజయ రహస్యం ఏమిటి?  అన్న ప్రశ్నకు సమాధానం: వారిలో ఉన్న ఆత్మవిశ్వాసమే.  కాబట్టి నేను ఎవ్వరికంటే తక్కువ వాడిని కాదు అని ప్రతి ఒక్కరూ బలంగా విశ్వసించడం వలన తమపై తమకు అచంచలమైన విశ్వాసం పెరిగి జీవిత లక్ష్యాలను సులువుగా చేరుకోగుతారు.  అందుకే, విశ్వాసమే బలం అని అందరూ తప్పక నమ్మాలి.  నేను తెలివి తక్కువ వాడిని అన్న వ్యతిరేక భావనను మీ మనుసులోనుండి తరిమికొట్టాలి.
ప్రతిరోజూ ఉదయం కాలకృత్యాలు అనంతరం 15 నుండి 30 నిమిషాలు వ్యాయామం గాని, యోగాసనాలు గాని చేయడం వలన శరీర సౌష్టవం, ఆరోగ్యం, అందంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది.  ఇది జ్ఞాపకశక్తిని పెంచుకొనుటకు ఎంతగానో తోడ్పడుతుంది.

జ్ఞాపకశక్తిని పెంచుకొనుటకు రెండవ పద్ధతి: ఏకాగ్రత.

ఏకాగ్రత అంటే ప్రస్తుతం మనం చేస్తున్న పని మీద మనసును కేంద్రీకరించడం.  ఏకాగ్రత లేనిదే ఏపనినీ విజయవంతంగా పూర్తి చేయలేము.  ఉదాహరణకు: 90% ప్రమాదాలు డ్రైవింగ్ చేసే వ్యక్తుల ఏకాగ్రతా లోపం వల్లనే జరుగుతుంటాయి.  తరగతి గదిలో ఉపాధ్యాయులు పాఠం చెబుతున్నపుడు ఏకాగ్రతతో వినడం వలన పాఠం చక్కగా అర్ధం అవుతుంది మరియు పాఠం యొక్క సారాంశం చాలా కాలం గుర్తుండిపోతుంది.  ఏకాగ్రతతో చదవడం వలన విద్యార్ధులు తక్కువ సమయంలో ఎక్కువ విషయాలను నేర్చుకోగలుగుతారు.  పరీక్షలలో మంచి మర్కులు మరియు మెరుగైన విజ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతారు.  తద్వారా సంఘంలో మర్యాద, మంచి గుర్తింపు లభిస్తుంది.  ఇంకా మనం కోరుకున్న ఉద్యోగంతో పాటు ఎన్నో విజయాలను, జీవిత లక్ష్యాలను చేరుకోగలుగుతాము.  మనిషి మెదడు వెయ్యి కంప్యూటర్లకన్నా శక్తివంతమైనది.  చరిత్రలో కొందరు మహానుభావులు సాధించిన విజయాలు వారి మెదడును కేవలం 20 శాతం ఉపయోగించడం వల్ల జరిగినవే.  నిజానికి, మనిషి మెదడును నూటికి నూరు శాతం వినియోగించుకొనే అవకాశం ప్రతి వ్యక్తికి ఉంది.  కాబట్టి మనం మన మెదడును ఎంత ఎక్కువగా ఉపయోగించుకుంటే అంత ఎక్కువ జ్ఞానాన్ని మరియు ఫలితాన్ని పొందవచ్చును.  కేవలం ఏకాగ్రత వల్లనే ఇది సాధ్యపడుతుంది.

ఏకాగ్రతను పెంచుకోవడానికి ధ్యానం మరియు ప్రాణాయామం అద్భుతమైన సాధనలు.  ప్రతిరోజు ఉదయం, సాయంత్రం 10 నిమిషాలు ధ్యానం(meditation) చేయడం వలన మెదడు శక్తివంతమై మనం నేర్చుకొన్న విషయాలను ఒక క్రమపద్ధతిలో పొందుపర్చుకుంటుంది.  ఇలా క్రమ పద్ధతిలో పొందుపర్చటం వలన ఎప్పుడైనా మనకు కావలసిన విషయాలను టక్కున గుర్తుకు తెచ్చుకోగలుగుతాము.  ప్రాణాయామం అంటే మన శ్వాసపై దృష్ఠిని నిలపడం.  రోజూ 5 నుంచి 10 నిమిషాలు ప్రాణాయామం చేయటం వలన మన శరీరంలోని విషవాయువులు బయటకు పోయి ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, చురుకుగా, ఉత్సాహంగా ఉంటాము.  ధ్యానం, ప్రాణాయామంతో పాటు పౌష్ఠికాహారం తీసుకుంటుంటే మంచి ఏకాగ్రతను సాధించగలుగుతాము.  మనం తీసుకొనే ఆహారంలో అన్ని రకాల విటమిన్లు, కార్బోహైడ్రేట్లు ఉండేటట్లు చూసుకోవాలి.  కడుపు నిండా కాకుండా సగభాగం ఖాలీ ఉండేటట్లు తినటం శ్రేయస్కరం.  దీనివల్ల జీర్ణక్రియ బాగా జరిగి మెదడుకు కావలసినంత శక్తి అందుతుంది మరియు జ్ఞాపకశక్తి వృద్ధి చెందుతుంది.

జ్ఞాపకశక్తిని పెంచుకొనుటకు మూడవ పద్ధతి: విశ్లేషణ

మనం చదివిన లేదా నేర్చుకొన్న విషయాలు మరియు సంఘటనలను విశ్లేషించడం ద్వారా చాలా కాలం జ్ఞాపకం ఉంచుకోగలుగుతాము.  అంటే మనం చదువుతున్న పాఠంలోని విషయాలను మరింత లోతుగా ఆలోచించడం, ఆ పాఠం యొక్క సారాంశాన్ని బాగుగా పరిశీలించడం, ఆ పాఠం గురించి కొన్ని ప్రశ్నలు టీచర్ని అడగటం మరియు మనకు మనమే కొన్ని ప్రశ్నలను అడుగుకోవటం ద్వారా ఆ పాఠాన్ని బాగా విశ్లేషించి అర్ధం చేసుకోగలుగుతాము.  అలాగే ప్రతి పాఠం లోని కఠిన పదాలు, వాక్యాలు, పాఠ్య సారాంశం మరియు ప్రశ్న జవాబులను టీచర్ లేదా కుటుంబ సభ్యుల సహాయంతో సులభతరం చేసుకోవాలి.  ఇలా చేయటం వలన మన ఆలోచనా శక్తి బాగా పెరుగుతుంది.  విశ్లేషణ, ఆలోచన, పరిశీలన - ఈ మూడింటి ద్వారా నేర్చుకొన్న విధ్య సులువుగా మన మెదడులోకి చేరుతుంది.  ఎప్పటికీ మర్చిపోవటం జరగదు.  విశ్లేషణ, పరిశీలన మరియు ఆలోచనా శక్తి ఉన్నవారు అన్ని రంగాలలో ముందంజలో ఉంటారు.

జ్ఞాపకశక్తిని పెంచుకొనుటకు నాల్గవ పద్ధతి: మననం

మననం అంటే, మనం ఒకసారి నేర్చుకొన్న విషయాలను వదిలివేయకుండా పదే పదే గుర్తుకు తెచ్చు కోవడం.  మనం చదివిన ప్రశ్న-జవాబులను ఒక చిత్తు కాగితం పై చూడకుండా రాయడం అలవాటు చేసుకోవాలి.  ఒకసారి ఇలా రాయటం వలన పది సార్లు చదివినంత ఫలితం ఉంటుంది.  మనిషి మెదడు అక్షరాల కంటే బొమ్మలను తొందరగా గుర్తుపెట్టుకుంటుంది.  అందువల్ల మనం నేర్చుకున్న విషయాలను ఒక బొమ్మల కథగాను లేదా పాఠంలోని సంఘటన ప్రస్తుతం మన కళ్ళముందు జరుగుతున్నట్లుగా మనసులో ఊహించుకోవటం వలన ఎలాంటి కష్టమైన విషయాన్నైనా మెదడుకు సులభంగా చేర్చగలుగుతాము మరియు ఈ విషయాలు చాలా కాలం గుర్తుండిపోతాయి.  ఒక పాఠం లోని ప్రశ్న-జవాబులను చదివిన తరువాత మీ కుటుంబ సభ్యులకు గాని, మిత్రులకు గాని చూడకుండా అప్పగించడం అలవాటు చేసుకోండి.  దీనివల్ల ఏమైనా తప్పులుంటే సరిచేసుకొనే అవకాశం కలుగుతుంది.  మరలా మర్చిపోవటం జరుగదు.
అద్భుతమైన జ్ఞాపకశక్తిని పెంచుకొనుటకు పైన తెలిపిన నాలుగు ముఖ్యమైన పద్ధతులను అనుసరిస్తూ ఈ క్రింది సూచనలను పాటిస్తూ ఉండండి.
1. నిత్యం మనం చేసే పనుల పట్ల ఇష్టాన్ని పెంచుకోవాలి.
2. చదివేటప్పుడు మనసులోపలనే చదువుకోకుండా పైకి చదవటం (బయటకు వినపడేటట్లు చదవటం) ఉత్తమమైన మార్గం.
3. రోజూ ఒకే చోట కూర్చొని చదివేకన్నా వేర్వేరు సబ్జెక్టులను వేర్వేరు చోట్ల కూర్చొని చదవటం మంచిది.
4. మెదడుకు విశ్రాంతి చాలా అవసరం కనుక, నిర్ణీత కాల వ్యవధిలో రోజుకు కనీసం 6 గంటలు నిద్రపోవటం చాలా అవసరం.

Post a Comment